2 దినవృత్తాంతములు 7:14
- "నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని
ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను
వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.”
సంఘానికి ఉజ్జీవము అవసరం. సాంప్రదాయం, ఆచారాలు, మతావేశం, నిష్ట,
స్వేచ్ఛవాదం, మన సంఘంలో దేవుని శక్తిని అడ్డుకునే దుర్గాలు. దేవుని తాజా కదలిక
మనకు ఆవసరం, చాలా కొద్దిమంది మాత్రమే రక్షింపబడుతున్నారు. విడుదల
పొందుతున్నారు, నిజమైన ఉజ్జీవపు ద్వారము తెరవగలిగిన మూడు తాళపుచెవులను
ప్రభువిచ్చాడు. అవేవి? అవి ఎలాగు పనిచేస్తాయి?
తగ్గింపు : “నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని”. ఆయన
యెదుట దీనమనస్సు కలిగి ప్రవర్తించాలని దేవుడు ఆదేశిస్తున్నాడు (మీకా. 6:8). గర్వం
మనలోకి వచ్చినప్పుడు దేవుడు బయటికి వెళ్లిపోతాడు. మనమీదే మన దృష్టి నిలుపుకున్నప్పుడు
ఆయనను మనం పోగొట్టుకుంటాము. విరిగి నలిగిన హృదయంతో ప్రభువు యెదుట
వినయపూర్వకంగా కనిపెట్టాలి. తగ్గింపు ఎల్లప్పుడు ఆయన సన్నిధిని ఆకర్షిస్తుంది.
ఆకలి : "ప్రార్థన చేసి నన్ను వెదకి...” ఉజ్జీవం రావాలంటే, దేవుని మందిరము
ప్రార్థన మందిరం కావాలి. అసలు పనిముందు మనం చేసేది ప్రార్థన కాదు; ప్రార్థనే మన
అసలు పని! అధునాతన సంఘాభివృద్ధి టెక్నిక్లు, కార్యక్రమాలు లేదా పద్దతులు మన
ప్రాధాన్యతలు కావు గాని మనం ఆయనను నిస్సహాయులమై వెదకాలి! ఆయనే మన దృష్టి
కేంద్రమై ఉండాలి.
పరిశుద్ధత : “తమ చెడు మార్గములను విడిచినయెడల” మనం పశ్చాత్తాపపడి
ప్రభువుచే పవిత్రపరచబడాలి. ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకొని విడిచిపెడతామో
ఆయన తన కృపను, కనికరాన్ని కుమ్మరిస్తాడు (సామె. 28:13). ఆయనచే శుద్ధి చేయబడిన
చేతులును, హృదయాలను కలిగి వున్నప్పుడు ఆయన ఉజ్జీవపు పరిశుద్ధ పర్వతాన్ని
ఎక్కుతాము. పరిశుద్ధ పాత్రలలో ఆయన తన ఆత్మను ఉంచుతాడు.
ఈ తాళపుచెవులను నీవు వాడినప్పుడు, దేవుడు ఉజ్జీవాన్ని సార్వభౌమత్వంతో
పంపించగలడు. ఆయనకు సరైనదని తోచినప్పుడు ఆయన ఆ వరం ఇస్తాడు. నీవు ఉజ్జీవం
కొరకు సిద్ధపడాలి. తాళపు చెవులు నీ చేతిలో ఉన్నవి. ఉజ్జీవం దేవుని హృదయంలో ఉంది.
నేడు తగ్గింపు, ఆకలి, పరిశుద్ధత నీ జీవిత లక్షణాలుగా ఉండును గాక!