Monday, October 10, 2022

క్రీస్తు రెండవ రాకడ జనవరి 28

అపొ.కా. 1:11 "గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు

చూచుచున్నారు? మీ యొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా

పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో

చెప్పిరి.”

సువార్తను ప్రకటిస్తున్నందుకు అరెస్టు చేయబడినప్పుడు అపొస్తలుడైన యోహాను

తొంభై సంవత్సరాల వయస్సు గలవాడు. శిక్ష అనుభవించుటకు పత్మాసు అను చిన్న ద్వీపానికి

పంపబడ్డాడు. అక్కడ వున్నప్పుడు, వృద్ధుడైన ఈ బోధకుడు బైబిలులోని చివరి గ్రంథమైన

ప్రకటన గ్రంథాన్ని వ్రాయుటకు దేవుడు ఆత్మనుండి వరుస దర్శనాలను పొందాడు. ఈ

గ్రంథంయొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, క్రీస్తు రెండవ రాకడ (ప్రక. 19:17-21). క్రీస్తు

భూమి మీదికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో యోహాను చూశాడు. మన లేఖన భాగంలో,

ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో ఆ విధంగానే భూమి మీదికి తిరిగి వస్తాడని

దూతలు వాగ్దానం చేశారు. ఆయన గొప్ప మహిమతో మేఘాలలో పరలోకానికి ఎక్కి

వెళ్లాడు. దేవుని పరిశుద్ధులు వెంటరాగా, యేసు భూమిని విడిచి వెళ్ళాడు గాని ఆయన

తిరిగి వస్తాడు! ఆయన అదే రీతిగా తిరిగి వస్తాడు. దేవదూతలు మరియు దూతల

పరివారంతో.

పాత నిబంధనలో క్రీస్తు రాకడ ప్రవచించబడింది (జెకర్యా 14:1-9), క్రొత్త

నిబంధనలో కూడా (ఫిలిప్పీ. 2:9-11). ఆయన మొదటి రాకడవలె (అనగా, ఆయన

జననం) క్రీస్తు రాకడ కూడ ఖచ్చితంగా జరిగే సంఘటన. మహాశ్రమల అనంతరం (మత్తయి

24:24-30) మరియు క్రీస్తు వెయ్యేండ్ల పాలన ముందు సంభవించును (ప్రక. 19-20).

యేసు అక్షరార్థంగా, శరీరంతో మరియు కనబడేలా ఆయన రెండవసారి వచ్చును. ఆయన

శరీరంతో తిరిగి వస్తాడు. రెండవ రాకడలో అందరికి కనబడతాడు. ఎత్తబడే సమయంలో

కేవలం క్రైస్తవులు మాత్రమే ఆయనను చూస్తారు గాని రెండవ రాకడలో ప్రతి ఒక్కరు

ఆయనను చూస్తారు (ప్రక. 1:7). ఆయన మహిమ బయలుపరచబడుతుంది. ఆయన

పరలోక సైన్యం దిగివస్తుంది. ఆయన శత్రువులు (క్రీస్తు విరోధి, అతని అనుచరగణం)

ఓడింపబడుతుంది (ప్రక. 19:17-21). న్యాయాధిపతిగా, రాజుగా యేసు పాలిస్తాడు.

యేసు తిరిగి వస్తున్నాడు! అంత్యకాలం సమీపిస్తున్న కొలది ఈ లోకం ఆధ్యాత్మికంగా

అంధకారంతో నిండిపోతుంది. ఎత్తబడిన, మహాశ్రమల తరువాత క్రీస్తు తిరిగి వస్తాడు.

మనకు తెలిసిన విధంగా దేవుడు చరిత్రను ఆరంభించాడు. ఆయనే తన ఇష్టం వచ్చినట్లు

ముగిస్తాడు. చరిత్ర నిజంగా “ఆయన కథ.”