లూకా 12:40 - "మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును
గనుక మీరును సిద్ధముగా ఉండుడి.”
హైవే ప్రక్కన ఒక పెద్ద బోర్డ్ మీద ఇలా వ్రాసివుంది - "యేసు త్వరగా వచ్చుచున్నాడు!”
కొన్ని సంవత్సరాల క్రితం, ఒక విశ్వాసి వచ్చేపోయేవారి సాక్ష్యార్ధం దానిని ఏర్పాటు చేశాడు.
కొందరు దాని వంక చూసి ఈ విధంగా అనుకొని వుండవచ్చును - “ఆ, సరేలే అది నా
జీవితకాలం అంతా నేను విన్నాను, నన్ను భయపెట్టాలని క్రైస్తవుల పన్నాగం అది అని
అనిపిస్తుంది.” నేను అలా నా కారును నడిపిస్తూ ఉండగా, ఆ గుర్తు తెలిసిపోయినా, దాని
సందేశం ఇంకా సత్యమే అని నాకు తోచింది. ఏ సమయంలోనైన దేవుని బూర ధ్వని
వినబడవచ్చును. ప్రధాన దూత శబ్ధము వినబడవచ్చును. ఈలోకంలో నుండి తన ప్రజలను
తీసికొని వెళ్లుటకు క్రీస్తు రావచ్చును.
మనం తీరికలేని జీవితాలను జీవిస్తున్నాం. యేసు ఏ క్షణంలోనైన తిరిగి వస్తాడనీ
ఎదురుచూపుతో మనం జీవించకుండ దినచర మనం నిమగ్నమైపోయాం. విందునుండి
తిరిగివచ్చే యజమానుని ఎదుర్కొనేందుకు ఎదురుచూచే దాసులవలె తన శిష్యులు తన కొరకు
కనిపెట్టాలని యేసు చెప్పాడు. వారు తమ నడుములు కట్టుకొని యుండాలి (లూకా 12:35).
తన శిష్యులు ఆయన రాకడ కొరకు ఎల్లప్పుడు కనిపెడుతూ సిద్ధంగా ఉండాలి (12:37).
వారు అనుకొనని గడియలో వస్తానని ఆయన వాగ్దానం చేశాడు గనుక ఏ గడియలోనైన
"ఆయన రావొచ్చునని ప్రతిరోజు కనిపెడుతూ జీవించాలి. యేసు తప్పక వస్తాడని కనిపెడుతూ,
ఆదిమ క్రైస్తవులు అనుదినం జీవించారు. ఆయన రాకను గూర్చిన ఆ ఎదురుచూపు వారి
యొక్క ప్రార్థనలు మరియు సౌవార్తీకరణలో కలిగించిన తీవ్రత ఆధునిక క్రైస్తవులలో కనబడుట
లేదు. మానవుని సమయం, దేవుని సమయం అంతానికి వచ్చిందని వారు విశ్వసించారు.
పరిశుద్ధమైన, ఫలభరితమైన జీవితాలను జీవించేందుకు వెదికారు. ఎందుకంటే, ఏక్షణంలోనైన
ప్రభువు పరలోకం నుండి దర్శనమిస్తాడని వారు నిశ్చయంగా నమ్మారు!
నీవు ఆ విధంగా జీవిస్తున్నావా? క్రీస్తు రాకడకు అనుదినం కనిపెడుతున్నావా?
అలా చేయకపోతే, ఎందుకు చేయుటలేదు? రహదారి ప్రక్కనవున్న పాత సైన్ బోర్డును
తిరిగి వ్రాయించాలని నేను తీవ్రంగా అనుకుంటున్నాను. దానిమీద వ్రాసింది పాతది కావొచ్చును
కాని సందేశం నేటికి కూడా క్రొత్తదే. యేసు త్వరగా రాబోతున్నాడు. మనం సిద్ధంగా ఉండాల్సిన
అవసరం ఉంది!