-
1 పేతురు 5:8 - “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన
అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”
“అపవాది” అని పిలువబడే ఆధ్యాత్మిక విరోధి ప్రతి క్రైస్తవునికి ఉన్నాడు. కొందరు
వాని ఉనికిని నిరాకరించినప్పటికీ, అతని వాస్తవీకత కాదనలేనిది. యేసు అతని గురించి
బోధించడమే కాకుండా, వాస్తవముగా అతన్ని ఎదుర్కొన్నాడు (లూకా 4వ అధ్యా.). ఈనాడు
లోకంలో వున్న కీడు వెనకాల అపవాది వున్నాడు. దేవుడు ఇతర దేవదూతలలో అతన్ని
శక్తిగల, ఉన్నత శ్రేణి ప్రధాన దూతగా సృష్టించాడు. దూతలందరిలో అతనికి అసమానమైన
సంపూర్ణత, సౌందర్యం, మహిమ ఉండెను. అతనికున్న అత్యున్నతమైన హోదా గర్వానికి,
తిరుగుబాటుకు నడిపించింది. దేవుని అధికారాన్ని, చేజిక్కించుకునేందుకు ప్రయత్నించాడు.
దేవుడు తనను వెంబడించిన దూతలతో పాటు అతనిని పరలోకంనుండి పడద్రోశాడు.
(యెషయా 14:12-17; యెహె. 28:11-19). ఆ పడిపోయిన దేవదూతలే బైబిలులో
పేర్కొనబడిన దురాత్మలు మరియు దయ్యాలు. సాతానుకు దాసులై వారు నేటికి ఇంకా
కల్లోలాలను సృష్టిస్తున్నారు.
అపవాదిని బైబిలు సాతానుగా పేర్కొంటుంది (విరోధి) (జెకర్యా 3:1), దుష్టుడు (1
యెహాను 5:19), సర్పము (ఆదికాండం 3:1), మహా ఘటసర్పము (ప్రకటన 12:3,4, 9),
సహదరుల మీద నేరము మోపువాడు (ప్రకటన 12:10,11), శోధకుడు (మార్కు 1:12,13),
దయ్యములకధిపతియైన బయెలెబూలు (మత్తయి 12:22-29), లోకాధికారి (యోహాను
12:31), ఈలోక దేవత (2 కొరింథీ. 4:3,4), వాయుమండల సంబంధియైన అధిపతి
(ఎఫెసీ. 2:2), అబద్ధములకు జనకుడు (యోహాను 8:44) అని కూడా పిలుస్తారు. భూమి
మీద అతని ప్రధాన కార్యక్రమం నశించిన ప్రజల మనస్సులను బంధించి, క్రీస్తును రక్షకుడిగా
పొందకుండా చేయుట (2 కొరింథీ. 4:4). అంతేగాక క్రైస్తవులు పాపం చేసేలా శోధించి
క్రీస్తు కొరకు వారి సాక్ష్యాన్ని దెబ్బతీయుట (1 థెస్స. 3:5). దొంగిలించి, చంపి, ప్రజలను
నాశనం చేసి, సంబంధాలను చెడగొట్టే చోరుడు (యోహాను 10:10).
అపవాది వాస్తవంగా ఉన్నవాడు, అపాయకరమైనవాడు మరియు నేటికి పనిచేస్తూనే
ఉన్నాడు. పరిశుద్ధాత్మతోను నింపబడుతూ, యేసు నామాన్ని, యేసు రక్తాన్ని, దేవుని వాక్యాన్ని
నీకు అన్వయించుకోవడం మొదలుపెట్టినప్పుడే వాడి మీద నీవు జయం పొందుతావు. నీ
విరోధి వాస్తవంగా ఉన్నవాడు, కాని యేసు వాడిని ఓడించాడు!