Monday, October 10, 2022

గలిలయకు వెళ్లుటకు బయలుదేరుము జనవరి 11



"యేసు భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు

వెళ్లవలెనని వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను.”

మత్తయి 28:10

యేసు భూమి మీదికి వచ్చినప్పుడు, మధ్యధరా సముద్రపు తూర్పు తీరంలో,

మారుమూల ప్రాంతంలో దేవుడు ఆయనను ఉంచాడు. మన ప్రభువు గ్రామీణ ప్రాంతంలో,

గలిలయ ప్రాంతంలోని నజరేతు అనే ఊరిలో ఒక సాధారణ కుటుంబంలో పెరిగాడు. ఆయన

అద్భుతాలలో చాలామట్టుకు గలిలయ సముద్రానికి దగ్గరలో, పర్వతశ్రేణితోను మరియు

సుందరమైన ప్రకృతి దృశ్యాలతో ఆవరింపబడిన స్థలంలో జరిగాయి. ఆయన పునరుత్థాన

స్థితిలో కూడా తనకిష్టమైన ఉత్తేజపరచే గలిలయకు తన శిష్యులను కలుసుకొనుటకు

హడావుడిగాను సందడిగాను ఉండే యెరూషలేమును విడిచివెళ్లాడన్న సంగతి మనకు ఆశ్చర్యం

కలిగించనవసరం లేదు. ఈ ప్రశాంతమైన ప్రదేశంలోనే ఆయన వారికి బృహత్తర ఆజ్ఞను

ఇచ్చాడు (మత్తయి 28:18-20). దేవునితో ఏకాంతంగా గడుపుటకై అన్నిటిని ప్రక్కన బెట్టవలసిన

అవసరతను యేసు గ్రహించాడు.

ఈనాడు మనం వత్తిడితో నిండిన, విరామమెరుగని ఉరుకుల పరుగుల జీవితాన్ని

జీవిస్తున్నాం. సెల్ఫోన్లు, ఫాక్స్ మెషిన్లు, బీపర్స్, పామ్ఫైలెట్స్, ఇ-మెయిల్స్, ఇంటర్నెట్లు

మరియు ఇబ్బంది పెట్టే వస్తు సామాగ్రిలతో మనకు మనమే బంధించుకున్నాం. నేడు చేయవలసిన

పనులకు మరిన్ని కలుపుకునే ప్రయత్నంలో అటు ఇటు పరుగెత్తుతూ అలసిపోతాం,

సొమ్మసిల్లిపోతాం. "ఫాస్ట్ ఫుడ్స్” కొరకే మనకు సమయం ఉంటుంది. “పనులను పూర్తి

చేయుటకు నేను ఆకలిగొనియున్నాను. జీవితంలో సరదా లేనంత వరకు పరుగెత్తుతాను,

పరుగెత్తుతూనే ఉంటాను. నేను నిజంగా చేయవలసినదల్లా జీవించాలి, చనిపోవాలి, కాని

నేను తొందరలో ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు" అనే పాటతో మనలో చాలమంది

తమను తాము గుర్తించుకుంటారు.

నీవు యేసు మాదిరిని అనుసరించి "గలిలయ వెళ్లుటకు బయలుదేరావేమో” ఈ

పరుగు పందెంలో నుండి ప్రక్కకు తొలగి విశ్రాంతి; ఆరాధన కొరకు ఏకాంత సమయాన్ని

గడపడం బహుశా మంచిదేమో. ఒంటరిగా ఉండి, నీ బైబిలునుండి ప్రార్థించి, దేవుని నెమ్మదిగా

ఆరాధించింది ఈ మధ్యకాలంలో ఎప్పుడో? నీ ప్రాణాన్ని పునరుద్ధరించులాగున నీవు

పచ్చికబయలుతో శాంతికరమైన జలాల ప్రక్కన పరుండాలని యేసు పిలుచుచున్నాడు.

దేవుడు ఆదాము, హవ్వలను ఏదేను తోటలో ఉంచాడేగాని ఎయిర్పోర్ట్ కాదు.

ఊరకుండి ఆయనను తెలిసికో. యేసుతో అన్యోన్యంగా సంభాషించాలి. 'గలిలయ' ఇంకా

అద్భుతాల స్థలమని నీవు కనుగొంటావు.